– సంఖ్యాబలం లేక వ్యూహాలతో ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్న కాంగ్రెస్
– నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
బీబీనగర్, డిసెంబర్ 18 : బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నో ఉద్రిక్తతలు, బల సమీకరణలు, వ్యూహాల నడుమ సాగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొండమడుగు గ్రామంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కడెం పాండురంగం సర్పంచ్‌గా గెలుపొందారు. వార్డు సభ్యుల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఆరుగురు, బీఆర్ఎస్ తరపున ఆరుగురు సభ్యులు ఎన్నికవ్వడంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. ఈ సమాన బలమే ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా పడేలా చేసింది. గురువారం అధికారులు ఉప సర్పంచ్ ఎన్నకకు మరోమారు తేదీ నిర్ణయించడంతో వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక వార్డు సభ్యురాలి మద్దతుతో ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు సభ్యురాలి ఇంటితో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు వార్డు సభ్యులు, బీఆర్ఎస్కు చెందిన ఒక వార్డు సభ్యురాలి మద్దతు పొందడంతో కాంగ్రెస్ అభ్యర్థి అరిగే శ్రీధర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవి బీజేపీ వద్ద ఉండగా, ఉప సర్పంచ్ పదవి కాంగ్రెస్ వశం కావడం ద్వారా గ్రామ పంచాయతీలో సహకార పాలన కొనసాగుతుందా లేక రాజకీయ ప్రతిఘర్షణలు తలెత్తుతాయా అన్న ప్రశ్న గ్రామ ప్రజల్లో మెదులుతుంది. రానున్న రోజుల్లో అభివృద్ధి నిర్ణయాలు రాజకీయ సమన్వయంతో సాగుతాయా, లేక ఆధిపత్య పోరుతో ఆగిపోతాయా అన్నది వేచి చూడాల్సిందే.

Bibinagar : కొండమడుగులో ఉద్రిక్తతల నడుమ ఉప సర్పంచ్ పోరు