యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక పోరాటాలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వ ర్గాల ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తుకు చేసుకొని కన్నీంటి పర్యంతమవుతున్నారు.
ఒకే వేదికపైకి 10వేల యువజన సంఘాలు..
జిట్టా బాలకృష్ణారెడ్డి వివేకానందుడి స్ఫూర్తితో ఓ కెరటంలా ఎగిసిపడ్డారు. యువజన సంఘాలన్నింటినీ కలిపి.. రాష్ట్ర స్థాయి లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి 10వేల సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. యువతను చైతన్య పరిచి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించడంతోపాటు, వివేకానంద, నేతాజీ, అంబేదర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఏర్పాటు చేయించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2005లో జాతీయ ఉత్తమ యువజన సేవా పురసారం అందించింది.
ఎన్నో సేవా కార్యక్రమాలు
జిట్టా రాజకీయాల్లోకి రాక ముందే అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తన మేనమామ, ప్రవాస భారతీయుడు డాక్టర్ చిలుముల రాంచంద్రారెడ్డి ఫౌండేషన్ సాయంతో 2003లోనే వారి అమ్మమ్మ తాత పేర్లతో చిలుముల శివరాజిని నారాయణరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించారు. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఈ కాలేజీలోనే అయిదేళ్ల పాటు ఉచితంగా తన సొంత డబ్బులతో మధ్యాహ్న భోజనం అందించారు. ఇక జిట్టా తల్లి పేరు పైన జిట్టా రాధమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఫ్లోరైడ్ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు
గ్రామాల్లో తాగునీరు కొనుకోలేక, కలుషిత జలాలతో అనారోగ్యం పాలై చర్మవ్యాధులు, గర్భస్రావాలు జరుగుతున్న పరిస్థితులను గమనించిన జిట్టా.. మూసీ పరీవాహక గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించాలనే ఆలోచనకు వచ్చి వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2006 సంవత్సరంలోనే భువనగిరి నియోజకవర్గంలోని 106గ్రామాల్లో మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అప్పటిదాకా మంచినీటి కోసం ఒకో క్యాన్‌ను రూ.40 వెచ్చించి కొనుగోలు చేసిన భువనగిరి ప్రాంత ప్రజలకు కేవలం రూ. 2లకే ఒక క్యాన్ నీటిని అందించారు.
ఢిల్లీ ఎర్రకోట వరకు తెలంగాణ జాతర..
తెలంగాణ జాతరలు, సంబురాలను భువనగిరి ఖిల్లా నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు నిర్వహించారు. మొదటి సారిగా 2007 ఫిబ్రవరిలో భువనగిరిలో తెలంగాణ సంస్కృతి, వంటకాలు, పండుగలపై తెలంగాణ జాతర నిర్వహించారు. జాతర సభలో తెలంగాణలో మొదటిసారిగా కేసీఆర్‌కు గొర్రెపిల్ల, గొంగడిని బహూకరించి గొల్ల కురుమల ప్రాధాన్యతను చాటారు. 2007 మార్చిలో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సంబురాలు, 2010లో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ గ్రౌండ్లో తెలంగాణ నుంచి గంగిరెడ్లు, కమ్మరి కొలిమి, కుమ్మరి సారె, వడ్రంగి, చేనేత మగ్గం, చేతివృత్తుల పనిముట్లు, కోయ, డప్పు, డోలు, చిందు, యక్షగానం, బోనాలు, బతుకమ్మ వివిధ కళారూపాలతో పాటు కళాకారులను ఢిల్లీకి తీసుకెళ్లారు. తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు. తెలంగాణ జాతర సందర్భంగా భువనగిరి ఖిల్లాను విద్యుత్ వెలుగులతో నింపారు.
ఉద్యమంలో గెలిచి.. రాజకీయంలో ఓడి..
యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2004లోనే భువనగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వగా.. దివంగత సీనియర్ నేత అలె నరేంద్ర భువనగిరి నుంచి పోటీ చేయడంతో జిట్టా టికెట్ త్యాగం చేశారు. 2009లో జరిగిన వివిధ రాజకీయ పరిణమాల నేపథ్యంలో టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 43,720 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి తన ఉనికి చాటారు.
2009 ఎన్నికల తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటన వెనకి తీసుకోవడంతో జిట్టా ఆ పార్టీకి అనివార్యంగా రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేయగా 39,270 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022 ఫిబ్రవరిలో యువ తెలంగాణ పార్టీని బీజేపీలోకి విలీనం చేశారు. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరినా.. భువనగిరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో 14 ఏండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఓడినా.. ఆస్తులమ్ముకున్నా.. వెనక్కి చూడలే..
జిట్టా బాలకృష్ణారెడ్డి మూడు సార్లు వరుస ఓటములు చవి చూసినా ఏనాడూ కుంగిపోలేదు. ఆస్తులు అమ్ముకుని ఆర్థికంగా దెబ్బతిన్నా.. గుండె ధైర్యం వీడలేదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ప్రజాసమస్యల పరిషారమే ఎజెండాగా పోరాటాలు కొనసాగించారు. ఉద్యమాలే ఊపిరిగా.. పోరాటాలే పంథాగా ఎంచుకుని.. ప్రజల కోసం రాత్రింబవళ్లు పని చేశారు. అంతకు ముందు యువ తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రణభేరి, తెగదెంపుల సంగ్రామం పేరుతో తెలంగాణ ప్రాంత జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, సదస్సులు ఢిల్లీలో తెలంగాణ జాతర నిర్వహించి ఉద్యమ స్ఫూర్తిని విస్తరింపజేశారు. సాగరహారం, మిలియన్ మార్చ్, రైల్ రోకో, రాస్తారోకో, వంటావార్పు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
అనేక సమస్యలపై పోరుబాట..
ప్రజా సమస్యలపై జిట్టా నిరంతర పోరాట చేస్తూనే ఉన్నారు. మూసీపై రసాయన శుద్ధి కార్మాగారం ఏర్పాటు చేయాలని, పల్లె పల్లెకు సురక్షిత జలాలు, కృష్ణా జలాలు అందించాలని వారం రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2005 ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు వలిగొండ నుంచి హైదరాబాద్ వరకు వివిధ గ్రామాల్లో పర్యటించారు. మూసీ పరిరక్షణ సమితితో కలిసి 200 కిలోమీటర్ల మేర జిట్టా పాదయాత్ర చేశారు. రూ.350 కోట్లు రసాయన శుద్ధి కర్మాగారం కోసం విడుదల అయ్యేట్టు చేయగలిగారు. నిమ్స్‌ను కాపాడడం ద్వారా ఎయిమ్స్ వచ్చేందుకు కారకుడయ్యారు. నిమ్స్ ఉద్యమంలో భాగంగా మూడు రోజులు జైలుకు కూడా వెళ్లారు. సీసీఎంబీ ఏర్పాటు కోసం కూడా పోరాటం చేశారు.
మూసీ నది పరీవాహక ప్రాంతాలకు కృష్ణా జలాలు అందివ్వాలన్న డిమాండ్‌తో భువనగిరి నియోజకవర్గంలో 2008లో 350 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రభుత్వ విధానాలపై, గల్ఫ్ కార్మికుల సమస్యలపై, కళాకారుల సమస్యలపై, పోతిరెడ్డిపాడుపై, ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 80శాతం రిజర్వేషన్ కోసం, బస్వాపురం భూనిర్వాసితుల కోసం, అసైన్డ్ భూముల విషయంలో, ఫార్మా కంపెనీల వల్ల చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ పరిసర ప్రాంతాలు విషతుల్యం అవుతుండడంతో వాటిపై నియంత్రణ కోసం పోరాటం చేశారు. బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి కాల్వ, బొల్లేపల్లి కాల్వ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని ఉద్యమించారు.