సంస్థాన్ నారాయణపురం, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా టీజీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఏఐవైఎఫ్ సంస్థాన్ నారాయణపురం మండల జనరల్ బాడీ సమావేశం కొండూరి వెంకటేశ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఒక అభయాన్ని ఇచ్చిందన్నారు. కానీ, ఆచరణలో రకరకాల కారణాలతో జాబ్ క్యాలెండర్ అమలును కాలయాపన చేస్తుందన్నారు.
ఒకవైపు ఎస్సీ వర్గీకరణ, మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు ఈ రెండింటిని కారణాలుగా చూపడం సరైంది కాదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లను వేయడాన్ని టీజీపీఎస్సీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని వారు విమర్శించారు. కొత్తగా ప్రకటించే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు ఈ రెండు అంశాలను పేర్కొంటూ కూడా నోటిఫికేషన్లు ఇచ్చే అధికారం టీజీపీఎస్సీకి ఉన్నట్లు, తుది ఫలితాలు మాత్రం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్ల పెంపునకు లోబడి మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు కూడా సమర్థిస్తుందన్నారు. ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు.
ఎంతో ఆశతో ఎదురుచూసే నిరుద్యోగులకు ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కార్యదర్శి చిలివేరు అంజయ్య, జిల్లా సమితి సభ్యుడు కలకొండ సంజీవ, నాయకులు కొండూరి వెంకటేశ్, మారగోని నాగరాజు, గడ్డం యాదగిరి, శనిగల నరేశ్, వీరమళ్ల నవీన్, రావుల ప్రశాంత్, గడ్డం యాదగిరి, ఐతరాజు కిరణ్, కొండూరి వంశీ, ఎలుగు ప్రవీణ్, దుబ్బాక సాయిచరణ్, వినోద్ పాల్గొన్నారు.