రామన్నపేట, డిసెంబర్ 27 : చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, అలాగే చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత వ్యక్తిగత రుణాలు రూ.33 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికే ఏడాది దాటిందన్నారు. అధికారులు డబ్బులు విడుదల చేశామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణ మాఫీ అమలు కాకపోవడం అత్యంత విచారకరమన్నారు. అలాగే చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. చేనేత సహకార సంఘాల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేసి, సహకార సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతులు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే ముందు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్న ప్రభుత్వం, చేనేత పరిశ్రమకు ఉపాధి కల్పించే ఇలాంటి చిన్న రుణాలను మాఫీ చేయకపోవడం పద్మశాలి కమ్యూనిటీపై, చేనేత పరిశ్రమపై ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుని సూచిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.