తుర్కపల్లి, జనవరి 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని బద్దుతండా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. తండావాసులు, వార్డు సభ్యుల సహకారంతో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. గతంలో ఈ తండా ముల్కలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా ఈ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 501 మంది జనాభా ఉన్న ఈ గ్రామపంచాయతీకి రెండేండ్లలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.13.70 లక్షలు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.13.18 లక్షలు, జనరల్ ఫండ్ రూ.2.58 లక్షలు మంజూరయ్యాయి. వీటి ద్వారా ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. ట్రాక్టర్ సాయంతో పారిశుధ్య కార్మికులు తండాలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తూ గ్రామ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. వాటర్ ట్యాంకర్‌తో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పెడుతూ సంరక్షిస్తున్నారు. తండాలోని వీధుల్లో 5,600 మొక్కలు నాటి పెంచుతున్నారు. తండాలో వైకుంఠధామాన్ని నిర్మించారు. గ్రామ నర్సరీలో ఈ సారి 10 వేల మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని వనాన్ని తలపిస్తున్నది. యాదాద్రికీసర ప్రధాన రహదారి నుంచి తండా వరకు రూ.55 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గ్రామ పంచాయతీ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం పూర్తయ్యింది. గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు 41ఎల్ఈడీ బల్బులు అమర్చారు. పల్లె ప్రగతి ద్వారా తండాలో చేసిన అభివృద్ధిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి
ప్రభుత్వ ప్రోత్సాహం, తండావాసులు, వార్డు సభ్యుల సహకారంతో తండా అభివృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అందజేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ తండా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. తండాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి ఆదర్శ తండాగా తీర్చిదిద్దుతాం.
-గుగులోతు సురేశ్‌నాయక్, సర్పంచ్