ఆత్మకూరు(ఎం), జులై 10 : ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలను అందివ్వాలని ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కూరెళ్ల గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ అధికారులందరూ సమయ పాలన పాటించి విధులకు హాజరు కావాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు నాయక్, డిప్యూటీ తాసీల్దార్ సఫియుద్దీన్, ఆర్ఐ మల్లికార్జునరావు, సూపరింటెండెంట్ లోకేశ్వర్ రెడ్డి, ఏపిఎం ఫక్కిరయ్య, హౌసింగ్ ఏఈ రవి పాల్గొన్నారు.