– యూరియా సంచి కోసం పొద్దుగాల వచ్చిన
– చెయ్యి నొప్పి ఉన్నా నాలుగు గంటలు కూర్చున్న
– సంచి ఏమో దొరకకపాయె
రాజాపేట, సెప్టెంబర్ 15 : రాజాపేట బెంకు (పీఏసీఎస్ కార్యాలయం) ఆఫీస్ కాడ మందు సంచులు ఇస్తుండ్రని పక్కింటి పోచయ్య చెప్పిండు. నాటేసిన చేను ఎర్రబడుతుంటే సూడలేక వారం కింద విరిగిన చెయ్యి బాగా నొప్పి ఉన్న కూడా పొద్దుగాలనే లేసిన. ముఖం కూడా కడగకుండా బెంకు ఆఫీస్ దగ్గరికి పోయిన. గప్పటికే ఆడ సానమంది వుండ్రు. అన్ని కాగితాలు లైన్ గా పెట్టిండ్రు. గాలికి కాగితం లేసిపోకుండా రౌతు పెట్టి లైన్ లో పెట్టి కాగితం దిక్కువే జూసుకుంటూ ఆడనే కూర్చున్న. ఆఫీసు సార్లు 11 గంటలకు వచ్చిండ్రు. లైన్ లో పెట్టిన కాగితాలన్నీ ఏరుక పోయిండ్రు. అప్పటికే నేను వచ్చి నాలుగు గంటలు. మల్ల గంట అయినాక పేర్లు పెట్టి పిలుచుడు మొదలుపెట్టిండ్రు. ఒక్కసారి ఆడాడా కూసునోలంతా ఆగమాగం ఆఫీస్ ముందు గుమి గూడిర్రు.
అర్ధ గంట అయినాక భిక్షపతి అని వినిపించింది. చేతగాని ప్రాణానికి జర పక్కకు జరుగు రా బిడ్డ అనుకుంటూ మందిని తోసుకుంటూ లోపటికి పోయిన. సార్ ఏమో ఒక చిట్టి చేతిలో పెట్టిండు. దాన్ని తీసుకొని మెల్లగా మందిలో నుంచి బయటికి వచ్చిన. మందు సంచి ఏడ ఇస్తారు బిడ్డ అని ఆడున్నోడిని అడిగిన. ఇప్పుడు ఇయఠే తాత, 22 తారీఖు నాడు రాపో అని జెప్పిండ్రు. ఆ మాట వినగానే మస్తు బాధ అనిపించింది. నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన తెలుపుతూ ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.