ఆత్మకూరు(ఎం), జూన్ 25 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక దందా జోరుగా సాగుతుంది. మండల కేంద్రంతో పాటు కొరటికల్, రాయిపల్లి, మొరిపిరాల, రహీంఖాన్ పేట గ్రామాల పరిధిలోని బిక్కేరు వాగు నుంచి కొందరు వ్యక్తులు ట్రాక్టర్ల ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద, నిర్మానుష్య ప్రదేశాల్లో పగలు డంపు చేసి రాత్రి పూట అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ ట్రిప్ రూ.8 వేల నుండి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు ఇంటికి సరిపడే ఇసుక కోసం అనుమతులు ఇచ్చినప్పటికీ ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు అధిక ట్రిప్పులు దొంగచాటుగా తరలిస్తున్నారు. ఇదేంటని గ్రామాల్లోని ప్రజలు ఇసుకను తరలిస్తున్న వ్యాపారులను నిలదీయడంతో పాటు, సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాదారులపై నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తక్కువ ధరకు ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.
Atmakur(M) : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా