భూదాన్ పోచంపల్లి నేతన్న కల సాకారమైంది. ఎన్నో ఏండ్లుగా నేత కార్మికులు చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్క్ సిటీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు షురూ కానున్నాయి. తాత్కాలికంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రారంభించనున్నారు.
భూదాన్‌పోచంపల్లి చేనేత రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పర్యాటక రంగంలో ఏకంగా ఉత్తర టూరిస్ట్ ప్లేస్‌గా నిలిచింది. తాజాగా పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైంది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ జీఓ నంబర్ 11 విడుదల చేశారు.
మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఐఐహెచ్‌టీ మంజూరు చేయగా.. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది స్పష్టత లేదు. పోచంపల్లితోపాటు గద్వాల పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ అంతిమంగా సదుపాయాలు, వసతులు, చేనేత పరిశ్రమ, పెద్ద సంఖ్యలో కార్మికులు, హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పోచంపల్లిలోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాత్కాలికంగా హైదరాబాద్‌లోనే..
వాస్తవానికి ఐఐహెచ్‌టీని కేంద్రం భూదాన్‌పోచంపల్లి మండలంలోని కనుముక్కలలో ఉన్న హ్యాండ్లూమ్ పార్కులో ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ఇక్కడ 26 ఎకరాల పార్కు టీజీసీఓ (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ) ఆధీనంలో ఉంది. సమయాభావం వల్ల ఇనిస్టిట్యూట్‌ను హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు.
కనుముక్కులలో సదుపాయాలు కల్పించే వరకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే లీజ్ బేసెస్లో నడిపించనున్నారు. కనుముక్కలలో ఉన్న పార్కుకు మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇది చెట్లు, చెత్తతో అస్తవ్యస్తంగా ఉంది. వీటిని తొలగించడంతోపాటు భవనాలను రెనోవేషన్ చేయనున్నారు. పూర్తి సదుపాయాల కల్పన తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలించనున్నారు. ఇదంతా జరుగడానికి ఏడాది నుంచి రెండేండ్లు పట్టే అవకాశం ఉంది.
అకడమిక్ ఇయర్ ప్రారంభం ఇలా..
ఐఐహెచ్‌టీకి అనుమతి రావడంతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో తొలుత ఫస్టియర్ తరగతులు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒక్కో తరగతిలో 60 సీట్లు ఉంటాయి. ఒక్కో సంవత్సరానికి 60 సీట్లతో మూడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి 180 సీట్లు నింపనున్నారు.
డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ (డీహెచ్‌టీటీ) కోర్సు అందుబాటులో ఉంది. ఇప్పటికే ఓపెన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. మరోవైపు ఇనిస్టిట్యూట్‌కు సంబంధించి అధికారులు డీపీఆర్ రూపొందించే పనిలో ఉన్నారు.
ఫ్యాకల్టీ, సిబ్బంది ఇలా..
ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం సంస్థ కొనసాగనుంది. 1: 25 రేషియో ప్రకారం ఫ్యాకల్టీని నియమించనున్నారు. ఫ్యాకల్టీ వివరాలను సైతం జీఓలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, ఏడుగురు లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అస్టిసెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు అటెండర్లు, ఐదుగురు ల్యాబ్ అటెండెంట్స్ తదితరులు ఉంటారు. ఇక తొమ్మిది మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది.
చైర్మన్‌గా హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కమిషనర్, అంతర్గత సభ్యుడిగా సీనియర్ ప్రొఫెసర్, సభ్యులుగా ఇద్దరు అకాడమిషియన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఫైనాస్స్ ఆఫీసర్, ఇద్దరు పారిశ్రామిక ఎగుమతిదారులు, మెంబర్ సెక్రటరీగా ప్రిన్సిపాల్ ఉంటారు. కాగా ఐఐహెచ్‌టీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.