మోటకొండూర్, ఆగస్టు 30 : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 21,103 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 10,495, మహిళాలు 10,608 మంది ఉన్నట్లు తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు గాను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు ముసాయిదా ఓటర్ల జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ యశోద, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, బీజేపీ నాయకుడు తండ కృష్ణ, బీసం కృష్ణంరాజు, అనంతుల నర్సిరెడ్డి, ఆలేటి బాలరాజు, నాయిని రాంచంద్రరెడ్డి, భూమండ్ల యాదయ్య, కార్తీక్, మల్లం కృష్ణ పాల్గొన్నారు.