రాజాపేట, జూన్ 17 : రాజాపేట మండలంలోని నమిలే గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ లక్క అలివేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించి పనుల నాణ్యత, నిర్మాణ వేగం, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన హౌసింగ్ పీడీ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహ ప్రవేశం చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గ్రామంలో చేపడుతున్న పనులపై స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఆమె, నిర్మాణాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. నిర్మాణ సామగ్రి నాణ్యత విషయంలో రాజీ పడకుండా అన్ని పనులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులి రాజు, ఉప సర్పంచ్ మార్క శివకుమార్, గ్రామ నాయకులు మాయకోటి రాజు, బొమ్మగాని శ్రీను, మార్కెట్ డైరెక్టర్ సీలేవేరు బాలరాజు, హౌసింగ్ ఏఈ వేముల వివేక్, పంచాయతీ కార్యదర్శి ఎండీ జెమిల్ పాల్గొన్నారు.