– ప్రొహిబిటెడ్ జాభితాతో పేద ప్రజలకు నష్టం
– బీఆర్ఎస్వీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్
బీబీనగర్, ఏప్రిల్ 06 : బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో సర్వే నంబర్లు 467, 468, 462లో ఉన్న గృహాలను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడాన్ని వెంటనే రద్దు చేసి వాటిని జాబితా నుండి తొలగించాలని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ డిమాండ్ చేశారు. సోమవారం రాఘవపురం గ్రామానికి చెందిన వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జక్కి నగేశ్ మాట్లాడుతూ.. రాఘవపురం గ్రామంలో మొత్తం 47 నివాస గృహాలను 22-ఏ కింద క్రయవిక్రయాలు జరగకుండా నిషేధ జాబితాలో చేర్చారని తెలిపారు.
దాదాపు 70 సంవత్సరాల క్రితం స్థలాలను కొనుగోలు చేసి లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించుకున్నప్పటికీ, అకస్మాత్తుగా వాటిని ప్రభుత్వ స్థలాలుగా ప్రకటించి క్రయవిక్రయాలు చేయకుండా నిషేధించడం తీవ్ర అన్యాయమన్నారు. దీంతో ఆ గృహాలకు ఎలాంటి విలువ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయకుండా ప్రజలు తీవ్ర నష్ట పోతున్నారని తెలిపారు. వెంటనే ఆ గృహాలను నిషేధిత జాబితా నుండి తొలగించి క్రయవిక్రయ హక్కులు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు రాఘవేందర్ గౌడ్, వార్డు సభ్యులు దొంతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బుయ్య పాండు గౌడ్, గుంటిమీది విజయ పాల్గొన్నారు.