సంస్థాన్ నారాయణపురం, జూన్ 03 : నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని సంస్థాన్ నారాయణపురం మండల ఏఓ వర్షిత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రెవెన్యూ గ్రామం నుండి ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన విత్తనాలను అందించారు. ఎంపికైన రైతులకు 10 కేజీల వరి విత్తనాలు, మూడు కేజీల పెసర విత్తనాల కిట్టును పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉచితంగా అందించిన విత్తనాలను రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాలను తోటి రైతులకు తక్కువ ధరకే అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ప్రొఫెసర్ రవీంద్రనాయక్, ఏఈఓ లు సైదులు శివకుమార్, శశి బిందు, అనురాధ, రవితేజ పాల్గొన్నారు.