జిల్లాలో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా జరుగుతున్నది. పట్టణాల్లో జోరుగా విక్రయాలు నడుస్తున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు దొరకకుండా తెప్పించుకొని సేవిస్తున్నారు. మరోవైపు గంజాయితోపాటు హాషిష్ ఆయిల్ దందా కూడా జోరుగా కొనసాగుతున్నది.
ఈజీ మనీకి అలవాటుపడి కొందరు గంజాయి అక్రమ రవాణాను పనిగా పెట్టుకున్నారు. తక్కువ ధరకు గంజాయి కొని, ఎక్కువ రేటుకు అమ్ముతూ ఆదాయం గడిస్తున్నారు. రోజురోజుకు గంజాయి ముఠాలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా నెట్‌వర్క్‌లను తయారు చేసుకుంటున్నాయి. పోలీసులకు పట్టుబడకుండా కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. పోలీసుల కండ్లు గప్పి సరుకును సరిహద్దులు దాటించేందుకు లారీల్లో బొగ్గుపొడి కింద, ఫ్లైయాష్ ఇటుకల్లో, వాహనాల కింద అరలు ఏర్పాటు చేయడం, కొబ్బరి బొండాల మధ్య, ఇనుప రేకుల మధ్యలో గంజాయి బస్తాలను పెట్టడం వంటి పంథాలను ఎంచుకుంటున్నారు. కోడ్ భాషతో గంజాయి దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో జోరుగా గంజాయి రవాణా జరుగుతున్నది. కొందరు ఆన్లైన్ ద్వారా కూడా గంజాయి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తున్నది.
విద్యార్థులు, యువతే టార్గెట్..
గంజాయి విక్రయదారులు విద్యార్థులు, యువతను లక్ష్యం చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్‌కు దగ్గరలో ఉండడంతో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ఎంచుకుని మొదటగా ఈ రొంపిలోకి లాగుతున్నారు. దాంతో పలువురు అమాయకులు చదువులు పక్కనపెట్టి గంజాయికి బానిస అవుతున్నారు. తోటి విద్యార్థులే ఇతరులకు అలవాటు చేస్తున్నారు. కొందరు విక్రయదారులు విద్యార్థులతోనే గుట్టచప్పుడు కాకుండా అమ్మకాలు జరిపిస్తున్నట్లు తెలుస్తున్నది. తోటి విద్యార్థులకు అమ్మి తిరిగి వ్యాపారులకు చెల్లిస్తే వారికి మాత్రం ఉచితంగా గంజాయి అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్ని కాలేజీలు, వాటి పరిసరాల్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల భువనగిరిలోని ఓ కాలేజీలో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు గంజాయితో సంబంధం ఉన్న విద్యార్థులను అరెస్ట్ చేయడం తెలిసిందే.
ధూల్‌పేట్ టు యాదాద్రి..
గంజాయి ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి రవాణా అవుతున్నది. అక్కడి ప్రాంతాల్లో సాగు చేసిన గంజాయిని ఇక్కడికి తరలిస్తున్నారు. మన దగ్గర రెండు జాతీయ రహదారులు ఉండడంతో జిల్లా మీదుగానే జోరుగా రవాణా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా తరలుతున్నది. పలు సందర్భాల్లో పక్కా సమాచారంతో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాకు ముఖ్యంగా ధూల్‌పేట నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల పట్టుబడిన పలు కేసుల్లో ఈ విషయం బయటపడింది. ఈ నెల 10న భువనగిరి పట్టణంలో పట్టుబడిన వ్యక్తి కూడా ధూల్‌పేట్ నుంచే సరుకు రవాణా చేశారు. ఏప్రిల్‌లో పట్టుబడిన ఆదర్శ్‌సింగ్ కూడా ధూల్‌పేట్ నుంచే తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ ధూల్‌పేట్ కొనసాగుతుండడంతో అక్కడి నుంచి రవాణా కొంతమేర కష్టంగా మారినట్లు తెలుస్తున్నది.
హాషిష్ ఆయిల్ వైపు..
కొన్ని సందర్భాల్లో గంజాయి రవాణా ఇబ్బందిగా మారడంతో సరఫరాదారులు హాషిష్ ఆయిల్‌పై ఫోకస్ పెడుతున్నారు. హాషిష్ ఆయిల్‌ను గంజాయి నుంచే తీస్తారు. 50 కిలోల గంజాయికి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అదే 50 కిలోల గంజాయి నుంచి లీటర్ హాషిష్ ఆయిల్ మాత్రమే వస్తుంది. దీని రేటు రూ.2లక్షల వరకు ఉంటుంది. లాభంతోపాటు రవాణా సులువుగా ఉండడంతో ఇప్పుడు హాషిష్ ఆయిల్‌పై దృష్టి పెడుతున్నారు. చిన్న చిన్న బాటిళ్లలో నింపుకొని రవాణా చేస్తున్నారు. దీనిపై అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పట్టుబడిన ఘటనలు కొన్ని..
పకడ్బందీ నిఘా పెట్టాం
జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై గట్టి నిఘా పెట్టాం. భువనగిరి, యాదగిరిగుట్ట పాయింట్లపై పకడ్బందీగా ఫోకస్ పెట్టాం. ఎప్పకటిప్పుడు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ధూల్‌పేట్ నుంచి రవాణా తగ్గడంతో ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నదనే దానిపై మా బృందాలు పని చేస్తున్నాయి.
– సైదులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్