యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రెండో రోజు కూడా ముసురు వదల్లేదు. రాత్రి నుంచి నాన్స్టాప్గానే వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జిల్లాలో రెండు రోజులుగా సూర్యుడు కనిపించడమే గగనమైంది.
సాయంత్రం తర్వాత జర్రంత గరువించింది. ఆకాశం మేఘావృతమై, మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యవసరమైతే తప్ప జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక పలు మండలాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంట్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నాయి.
అత్యధికంగా 19.6 సెంటీమీటర్ల వర్షపాతం
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అడ్డగూడూరులో అత్యధికంగా 19.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోచంపల్లిలో 17, బీబీనగర్, మోత్కూరులో 10, రామన్నపేట, ఆత్మకూరు (ఎం)లో 9.8, నారాయణపురంలో 9.3, చౌటుప్పల్‌లో 9.2, బొమ్మలరామారంలో 9.1, ఆలేరులో 8.1, వలిగొండ, తుర్కపల్లిలో 8, భువనగిరిలో 7.9, రాజాపేటలో 7.8, మోటకొండూరులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో సోమవారం కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రవాహం పెరిగింది. జిల్లా మీదుగా వెళ్తున్న మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి వద్ద ఉధృతి పెరుగడంతో పరిస్థితిని స్థానిక అధికారులతో కలిసి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలిగొండ మండలంలోని భీమలిం గం కత్వ వద్ద సంగెం-గొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. రెవెన్యూ అధికారులు రెండు వైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
జిల్లాలో వర్ష ప్రభావం ఇలా..
వర్షపాతం వివరాలు ఇలా..
మండలం : వర్షపాతం (సెం.మీ.)
అడ్డగూడూరు 19.6
పోచంపల్లి 17
బీబీనగర్ 10
మోత్కూరు 10
రామన్నపేట 9.8
ఆత్మకూరు (ఎం) 9.8
నారాయణపురం 9.3
చౌటుప్పల్ 9.2
బొమ్మలరామారం 9.1
ఆలేరు 8.1
వలిగొండ 8
తుర్కపల్లి 8
భువనగిరి 7.9
రాజాపేట 7.8
మోటకొండూరు 7