బీబీనగర్, ఏప్రిల్ 16 : బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గూడూరు జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు గూడూరు సహజానంద రెడ్డి గూడూరు ప్రాథమిక పాఠశాలలో మూడు కొత్త తరగతి గదులను నిర్మించారు. నూతనంగా నిర్మించిన తరగతి గదులను గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్, నిర్మాణ దాత గూడూరు సహజానంద రెడ్డితో కలసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పాఠశాలకు తరగతి గదులు నిర్మించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి సహకరించిన గూడూరు సహజానంద రెడ్డిని ఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు భాష బోయిన బాల ప్రసాద్, దంతూరి రాణి, కసగాని అరుణ, అంకర్ల శ్రీనివాస్, తలుపునూరి అశ్విని, బాలరాజ్ గౌడ్, బింగి లావణ్య రమేష్, మాజీ ఉప సర్పంచ్ బోయపల్లి నరసింహ రెడ్డి, నాయకులు పరమేష్ గౌడ్, గూడూరు సంజీవరెడ్డి, శివకోటి మాధవాచారి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గూడూరు ప్రాథమిక పాఠశాల అభివృద్ధి