– ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో అలసత్వంపై మాజీ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆగ్రహం
బీబీనగర్, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవపురం, వెంకిర్యాల, మక్తానంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులుగా ధాన్యం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ధాన్యాన్ని రైస్ మిల్లులకు సకాలంలో తరలించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యంలో ఇంకా 25 శాతం కూడా పూర్తిస్థాయిలో తరలింపు జరగలేదని ఆరోపించారు. గత వారం రోజులుగా మండల నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదన్నారు. సోమవారం వివిధ గ్రామాల్లో పర్యటించి ధాన్యం తరలింపు పరిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం సరికాదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో జాప్యం కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తే రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు గాదె నరేందర్‌రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గూదే శ్రీశైలం, నాయకులు పిట్టల అశోక్, మంచాల రవికుమార్, కొంతం విజయ్ భాస్కర్‌గౌడ్, దేవరుప్పుల పృథ్విరాజ్, కనకబోయిన నాగరాజు, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కి నగేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

‘రైతుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి సరికాదు’