బీబీనగర్, జనవరి 02 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వా మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గ్రేడ్–వన్ దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం రెండేళ్లుగా అభివృద్ధి లేక పూర్తిగా కుంటుపడిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా భక్తులకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో కోతుల బెడద అధికమై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవాలయ పునర్నిర్మాణం, మారెమ్మ–పోచమ్మ ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న నామమాత్రపు కమిటీతో దేవస్థానం అభివృద్ధి సాధ్యం కాదని, జాతరల సమయంలో తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వo పూర్తిస్థాయి కమిటీని నియమించి ఆలయ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, బీబీనగర్ నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రెండేళ్లు పూర్తయినా పనులు ప్రారంభించకపోవడం ప్రజలను నిరాశకు గురి చేస్తోందని తెలిపారు. హైదరాబాద్కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్రస్థాయి దేవాలయానికి ఇప్పటికీ సింగిల్ రోడ్డుతోనే సరిపెట్టుకోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వాగ్దానాలను మాటలకే పరిమితం చేయకుండా తక్షణమే డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, దేవస్థానానికి పూర్తిస్థాయి కమిటీని నియమించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.