ఆలేరు టౌన్, మార్చి 11: తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అందక రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా ఎద్దు వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యమని రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి (Gongidi Mahender Reddy) అన్నారు. మంగళవారం ఆలేరు మండలంలోని శివలాల్ తండాలోని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, గిరిజన మహిళా రైతులను ఓదార్చి ఆయన మాట్లాడారు. కేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరం నీళ్లు వదలక రేవంత్ రెడ్డి రైతులను అరిగోశ పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు నుంచి జనగాం నుంచి సుమారు 20 గ్రామాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపామని గుర్తు చేశారు.
ప్రజలు 50 వేల మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తే కనీసం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించకుండా, రైతుల కష్టాలు తెలుసుకోకుండా ఉండటం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరే శంకరయ్య, సీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదపాక నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, సర్పంచులు ఎస్ రెడ్డి మహేందర్ రెడ్డి, బక్క రాంప్రసాద్, వడ్ల నవ్య శోభన్ బాబు, కోటగిరి పండరి, మాజీ వైస్ ఎంపీపీ కొరుకొప్పుల, కిష్టయ్య, మండల సెక్రెటరీ జనరల్ రచ్చ రామ్ నరసయ్య, విజయ్, పంతం కృష్ణ, దయ్యాల సంపత్, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.