రామన్నపేట జులై 02 : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని యాదాద్రి భువనగిరి స్వర్ణకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నెగంటి వెంకటేశ్వరాచారి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు రూ.700 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న కర్మాగారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రామన్నపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతి వృత్తులకు చేయూతను అందించాల్సిన ప్రభుత్వాలు, కార్పొరేట్ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటూ తరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసే ఇలాంటి నిర్ణయాల వల్ల స్వర్ణకార వృత్తిదారులు ఇంకా పనులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఓవైపు కార్పొరేట్ జ్యువెలరీ షాపుల మూలంగా ఉపాధి కోల్పోయి స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు పెరుగుతున్న బంగారం ధరల మూలంగా పనులు లేక ఇప్పటికే అనేకమంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలిపారు. ఈ తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థకు అందించదలచుకున్న మద్దతును ఉపసంహరించుకుని స్వర్ణకార వృత్తిదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీరామోజు నరసింహాచారి, చోల్లేటి చంద్రశేఖర్ చారి, మారోజు రాఘవాచారి, శుభకోటి, శశి, కృష్ణమాచారి పాల్గొన్నారు.