– అంతరాలయ ప్రవేశం, శెల్లా, కనుము, 5 లడ్డూలు, కేజీ పులిహోర, వేదాశీర్వచనం
– త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రిక
– రూ.20 కోట్లతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ, 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
– మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ వెంకట్రావ్
యాదగిరిగుట్ట, జూలై 19 : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఏ సమయంలోనైనా శీఘ్రంగా దర్శించుకునేందుకు రూ.5 వేలతో గరుఢ టికెట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట ఈఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. టికెట్ తీసుకునే భక్తుడికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలును కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టికెట్‌తో స్వామివారి అంతరాలయ ప్రవేశం కల్పించడంతో పాటు స్వామివారి వేదాశీర్వచనం, శెల్లా, కనుము, 5 లడ్డూలు, కేజీ పులిహోర, కొండపైకి వాహన అనుమతి ఉంటుందన్నారు. ఒక భక్తుడికి ఒక టికెట్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి రాగానే అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్ సంస్థ తరఫున యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాస పత్రిక, టీవీ చానల్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. కొండపైకి భద్రతాపరమైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలోనే ఏడాది కాలపరిమితిపై 50 మందిని తాత్కాలికంగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని తీసుకురానున్నట్లు తెలిపారు. కొండ కింద పార్కింగ్ ప్రాంతంలో వాహన పూజ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణ వ్రత పూజకు గతంలో రూ.800 కాగా మరో 200 పెంచి రూ.1000 చేయనున్నట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరా అంతరాయం కలుగకుండా త్వరలో దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు రూ.20 కోట్లతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ అలాగే 4 మెగావాట్ల సోలార్ పవర్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన పది సెకన్లలోనే విద్యుత్ పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకు కోసం టీఎస్ రెడ్కోను సంప్రదించామని, ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొండ చుట్టూ గల 5 సర్కిళ్లకు నామకరణం చేశామని త్వరలో బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహాల ఏర్పాటుకు రూ.3.6 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్కిటెక్ట్, స్తపతులు, ఇంజినీర్లు అంచనా వేశారన్నారు. ఇందుకు కోసం దాతల సహకారంతో పాటు దేవస్థానం నుంచి నిధులను సమకూర్చనున్నట్లు తెలిపారు. ఒక్కో విగ్రహం 70 అడుగుల ఎత్తులో ఉంటుందన్నారు. ఆంజనేయ, గరుఢ, ప్రహ్లాదుడు, రామానుజ, యాద మహర్షి విగ్రహాలు నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, డీఈఓ దోర్బల భాస్కర్, ఈఈ వూడేపు రామారావు, ఏపీఎఫ్ సీఐ శేషగిరిరావు పాల్గొన్నారు.