యాదగిరిగుట్ట, జూన్ 04 : శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటారా లేక పనులను పూర్తి చేస్తారా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పాపట్ల నరహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాల్వపల్లి, కొలనుపాక బ్రిడ్జి పనులు కమీషన్ల కోసం శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. పారుపల్లి బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. స్వచ్ఛంద సంస్థతో యాదగిరిగుట్ట పట్టణంలో డంపింగ్ యార్డు పూర్తైనా ఎందుకు వాడటం లేదన్నారు. యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కొండకింద నిర్మించిన నిత్య అన్నదాన భవనం ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.
విశ్వ సుందరీమణులకు రూ.36 లక్షలు కేటాయించిన ఆలయ అధికారులు భక్తులకు అన్నదాన భవనాన్ని ఎందుకు ప్రారంభించడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికి ఇప్పటి వరకు పునాది కూడ తీయలేదన్నారు. గత ప్రభుత్వం ఇప్పటికే దుకాణ సముధాయం నిర్మాణం చేసిందన్నారు. భూ నిర్వాసితులకు దుకాణాలను వెంటనే అప్పగించాలన్నారు. శోభయమానంగా ఉండాల్సిన యాదగిరి క్షేత్రంలో వ్యాపారం చేస్తున్నారన్నారు. దీనికి అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
మెడికల్ కళాశాల ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వం పనులకు శంకుస్థాపన చేసినా ఇంకా పనులు ఎందుకు ప్రారంభించలేదని అడిగారు. వంద పడకల ఆస్పత్రి ఊసే లేదన్నారు. మెడికల్ కళాశాల తరగతులను భువనగిరిలో ఎందుకు నిర్వహిస్తున్నారన్నారు. త్వరితగతిన మెడికల్ కళాశాలను వెంటనే మల్లాపురంలో నిర్మాణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేరబోయిన సత్యనారాయణ, అరే శ్రీధర్, దండబోయిన వీరేశం, కొన్యాల నరసింహారెడ్డి, షారాజీ రాజేశ్ యాదవ్, పబ్బల రాజు, ఆకుల శేఖర్ పాల్గొన్నారు.