– ధర్మారెడ్డిపెల్లి కాలువ వెడల్పు త్వరగా పూర్తి చేయాలి
– గోకారం చెరువులో మూసీ నీళ్లు నింపాలి
– సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్
చౌటుప్పల్, మార్చి 28 : చౌటుప్పల్ మండలం జెకేసారం గ్రామంలో గల గోకారం చెరువులో నీళ్లు లేకపోవడం, బోర్లు, బావుల్లో నీరు అడుగంటడంతో సుమారు 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఇంటింటికి సీపీఎం కార్యక్రమం ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా శనివారం సీపీఎం బృందం రైతులతో కలిసి ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు రాగిరి కిష్టయ్య మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఎండిపోతున్న పొలాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి పెళ్లి కాలువ వెడల్పు పనులు నత్త నడకన సాగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సరుర్ కాంట్రాక్టు పనులను వేగవంతం చేసి గోకరం చెరువును మూసీ నీటితో నింపాలన్నారు.
అధికార యంత్రాంగం స్పందించకపోతే రైతాంగంతో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో ప్రజల నుండి మంచి మద్దతు ఉందని, పార్టీ ప్రజా ఉద్యమాలకు రూ.3 వేలు విరాళాలుగా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధు కృష్ణ, సిపిఎం పార్టీ కార్యదర్శి పొట్ట శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు బోదాసు వెంకటేశ్, నాయకులు సమిరెడ్డి సత్తిరెడ్డి, పల్లె సత్యం, బోదాసు నరేశ్, రైతులు పల్లె అంజయ్య, పద్మ, నక్క భాస్కర్, పల్లె వంశీ పాల్గొన్నారు.