– భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 20 : యూరియా మానిటరింగ్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో యూరియా మానిటరింగ్ యాప్‌పై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పరిపాలన అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇంటి వద్ద నుండే తమ స్మార్ట్ ఫోన్ ద్వారా కావాల్సిన యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. వరి పంటకు గాను ఎకరానికి రెండున్నర బస్తాల యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లో యూరియాను తీసుకెళ్లాలని, లేనిచో అది క్యాన్సిల్ అవుతుందని తెలిపారు. యూరియా బుకింగ్ యాప్‌లో యాదాద్రి జిల్లాలో ఎక్కడినుండైనా తీసుకోవచ్చని చెప్పారు. ఈ విధానం ఈ నెల 22 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, ఏఓ శైలజ, ఎంపీఓ మసీద్ పాల్గొన్నారు.