సూర్యాపేట, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోదీ సర్కార్ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేస్తారా, లేదా అన్నది ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. గల్లీలో కూర్చుని గలీజ్ మాటలతో రాజకీయాలు నెరుపకుండా కొనుగోళ్లు చేస్తామన్న లేఖను తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఆయన ఉద్బోధించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షకు నిరసనగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు దాదాపు 6వేలకు పైనే మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా? అన్నది బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పాలని నిలదీశారు. మోదీ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అంగీకరించే వరకు వత్తిడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు.
రైతులపై చీమలు పారినా తెలంగాణ సర్కారు సహించబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి మాత్రమే కాదని రైతుల పక్షం అన్నది కేంద్రం గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిడికిలి బిగిస్తే ఢిల్లీ సర్కార్ అతలాకుతలం అవుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే సస్యశ్యామలం అవుతున్నదని, అటువంటి తరుణంలో కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ చేతులు ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం బాగుపడడం ఇష్టం లేకనే రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం ముందుకు తెస్తుందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న ద్వంద విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు. రైతుల ఆగ్రహంతో మోదీ సర్కారు మాడిమసై పోతుందని, కేంద్రం పద్ధతి మార్చుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ధర్నాలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఒట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు అన్నపూర్ణమ్మ, ఉప్పల లలితాఆనంద్తో పాటు పెద్ద ఎత్తున రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.