ఆత్మకూరు (ఎం), నవంబర్ 04 : అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు పలువురికి చేతి వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడక, కండ్లు స్కాన్ కాకపోవడంతో గత మూడు, నాలుగు నెలల నుండి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు కోల్పోతున్నారని తెలంగాణ ప్రాంత ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ జెట్ట శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. వయో భారం వల్ల కొంతమందికి చేతి వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడటం లేదన్నారు. మరికొంత మందికి కంటి శుక్లల సమస్య వల్ల ఆపరేషన్ చేయించుకున్న వారికి, కంటిలో ఏదైనా సమస్య ఉన్న వారికి కండ్లు స్కాన్ కాకపోవడంతో పింఛన్లు అందుకోవడవంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆసరా పెన్షన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులకు వేలి ముద్రలు, కంటి స్కానింగ్‌తో సంబంధం లేకుండా నగదు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.