భూదాన్ పోచంపల్లి, మే 01 : రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఎరుకల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి సాయ శక్తుల కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో నాంచారమ్మ తల్లి జాతరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆలయంలో ఎరుకల నాంచారమ్మ, పొడియ్య అయ్యవార్ల కల్యాణ మహోత్సవం, హోమం బోనాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయానికి రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయానికి మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఏటా జాతర చేసుకోవడం ఆనవాయితని, జాతరను ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్నారు. దేవాలయానికి మౌలిక వసతులు కల్పిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య, తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, రాష్ట్ర నాయకులు గణపురం ప్రభాకర్, కూరాకుల రాములు, సత్యనారాయణ, కూతడి భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉటుకూరి అశోక్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఏలే చంద్రశేఖర్, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు మేకల రవీందర్ రెడ్డి, డబ్బికార్ సాహేష్, జిల్లా నాయకుడు చిక్క కృష్ణ, గంజి బసవలింగం, పల్లెకాడి బసవయ్య పాల్గొన్నారు.