రాజాపేట, సెప్టెంబర్ 11 : రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఏదుల వివేక్, ఎర్రోళ్ల రాహుల్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 9న నల్లగొండ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ డ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొనగా, దూది వెంకటాపురం పాఠశాల నుంచి వివేక్, రాహుల్ పాల్గొన్నారు. వీరు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పాతకోటి మధు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సుంచు విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువుపై ఆసక్తిని పెంచుతాయని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు నర్సింహాచారి, వెంకటేశ్వర్లు, రవీందర్, శ్రీనివాస్, ఎలేందర్‌రెడ్డి, కనకయ్య, విజయ్‌కుమార్ అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.