రాజాపేట, సెప్టెంబర్ 11 : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అన్నారు. శుక్రవారం రాజాపేట పోలీస్స్టేషన్లో ఎస్ఐ తఖియుద్దీన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సీఐ శంకర్, ఎంపీడీవో నాగవేణి, డిప్యూటీ తాసీల్దార్ ప్రదీప్ తదితర అధికారులు పాల్గొన్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం, ఊరేగింపులు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుతంగా, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించాలని అధికారులు కోరారు.
ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎస్ఐ తఖియుద్దిన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా విగ్రహాలను పంపిణీ చేసి, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఉత్సవాలను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని గణేష్ ఉత్సవ కమిటీలు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.