– రాజాపేట మండలం పాముకుంటలో ఎండుతున్న పంటలు
– పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
– ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
– రాజాపేటను కరువు మండలంగా ప్రకటించాలి
– బీఆర్ఎస్ నాయకులు
రాజాపేట, సెప్టెంబర్ 11 : ఆరుగాలం కష్టపడి, లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతుల గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను మదర్ డెయిరీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ సంధిల భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకవైపు సాగునీరు అందక, మరోవైపు నిరంతర విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీళ్ల ఐలయ్య’ అని చెప్పుకుంటున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొంటే సాగునీరు ఎందుకు అందించడం లేదని వారు ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోనే రాజాపేట మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు అందుకు సంబంధించి తట్టెడు మట్టి కూడా తీసిన దాఖలాలు లేవని విమర్శించారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు.. పంటలు ఎండిపోతున్న దృశ్యాలను చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారని అన్నారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కువ కాలం నిలవదు” అని వ్యాఖ్యానించారు. రైతుల గోస, బాధలు ప్రభుత్వానికి అర్థం కావాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎండిపోతున్న పంటలను పరిశీలించాలని సూచించారు. విద్యుత్, సాగునీటి సమస్యలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాజాపేట మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, పాముకుంటలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సమయంలో పలువురు రైతులు తమ పంటల పరిస్థితిని నేతలకు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు.