Rajasthan : రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుళ్లను కొట్టి చంపాడు. అది కూడా నలుగురి తలలు పగిలిపోయేంతగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జైపూర్, కర్దాని పోలీస్ స్టేషన్ పరిధి, గోవింద్‌పుర ప్రాంతంలో జరిగింది. మృతులను గీతా ఝా, ఆమె కూతుళ్లు నందిని (23), రాధిక (18), గౌరి (14)గా, నిందితుడిని రాహుల్ ఝాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి.
రాహుల్ ఝా తన భార్య, ముగ్గురు కూతుళ్లు, తండ్రితో కలిసి గోవింద్‌పుర ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి వీరంతా తమ ఇంటిలో నిద్రపోతుండగా.. ఉదయం 3.00 గంటలు 4.00 గంటల మధ్య రాహుల్ ఝా నలుగురిని హత్య చేశాడు. ఇంటి స్లాబ్ నిర్మాణంలో వాడే పెద్ద, పదునైన రాయితో నలుగురి తలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వారి తలలు నుజ్జునుజ్జయ్యాయి. నలుగురూ నిద్రలో ఉండగా, వారిపై దాడి చేసి చంపేశాడు. వీరంతా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
భార్య గీతా ఝా మృతదేహం ఫస్ట్ఫ్లర్లోని గదిలో లభించింది. ముగ్గురు కూతుళ్ల మృతదేహాలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న రెండు వేర్వేరు గదుల్లో దొరికాయి. ఈ ఘటన తర్వాత ఉదయం ఆరు గంటల వరకు నిందితుడు రాహుల్ ఝా అక్కడే ఉన్నాడు. ఉదయం తెల్లవారిన తర్వాత.. వేరే గదిలో ఉంటున్న తన తండ్రికి టీ కూడా చేసి ఇచ్చాడు. ఆ సమయంలో అతడు చాలా సాధారణంగానే ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో భద్రత ఏర్పాటు చేశారు.