కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతకు చెందిన ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆయన ఇల్లు ధ్వంసమైంది. సమీపంలోని పొరుగిళ్లు కూడా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టీఎంసీ నేత ఇంట్లో బాంబులు దాచినట్లు బీజేపీ ఆరోపించింది. (Blast destroys TMC leader’s home) పశ్చిమ బెంగాల్లోని బరుయిపూర్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం లాల్పోల్ ప్రాంతంలోని టీఎంసీ నేత ద్విజేన్ మండల్ నివాసంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిల్డింగ్ కింది అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
కాగా, టీఎంసీ నేత ద్విజేన్ మండల్ తన ఇంటిని అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని స్థానికులు విమర్శించారు. ఆ ఇంట్లో ఆయన బాంబులు దాచినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. తమపై దాడి కోసమే అక్కడ బాంబులు ఉంచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు అక్కడ నిరసనకు దిగడంతో ఇది రాజకీయ వివాదానికి దారితీసింది.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పేలుడు జరిగిన టీఎంసీ నేత ఇంటిని పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడకు రప్పించారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి పేలుడు పదార్థాల ఆనవాళ్ల కోసం టీఎంసీ నేత ఇంటి శిథిలాలను పరిశీలిస్తున్నారు.