బీబీనగర్, ఏప్రిల్ 09 : మానవ సంబంధాలను మరువద్దు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రుల పోషణ, సంరక్షణను పిల్లలు తమ బాధ్యతగా భావించి చూసుకోవాలన్నారు. వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.5 లక్షల ఇన్రెన్స్లు అందజేస్తుందన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వయోధికులు అని కాకుండా మానసిక బలవంతులుగా వారిని పిలవాలన్నారు. రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది వయోధికులు ఉన్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్దికి రూ.57 కోట్ల హెచ్ఎండీఏ నిధులు మంజూరు అయ్యాయని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుందామని చెప్పారు.
వయో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ భవనం చుట్టూ ఉన్న ఖాళీ జాగాలో రూ.4 లక్షలతో పార్కును అభివృద్ధి చేయాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ పార్క్ డెవలప్మెంట్కు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి ప్రణిత పింగళ్‌రెడ్డి, యర్కల సుధాకర్‌గౌడ్, గోలి నరేందర్‌రెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, పొటోళ్ల శ్యామ్‌గౌడ్, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్, ప్రదాన కార్యదర్శి కీసర లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎరం మనోహర్, బండారు అగమయ్యగౌడ్, సన్నిబోయిన ప్రసాద్, సభ్యుడు యాస నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Elderly Welfare Association Building : మానవ సంబంధాలు మరువద్దు : గుత్తా సుఖేందర్‌రెడ్డి