– రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి
బీబీనగర్, మే 16 : కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగలా సాగిందని, కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని బీబీనగర్ మండల మాజీ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను తేమ కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని బట్టుగూడ గ్రామంలో కాదాంబరి రైస్ మిల్లును సందర్శించి రైజ్ మిల్లు యాజమాన్యం రైతులకు చేస్తున్న మోసాలపై నిలదీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వడ్లకు తేమ పేరుతో కోత విధించడం సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం రాశులు అలాగే ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. అధికారులు పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయినా లారీలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలకు వచ్చే ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కొనుగోలు కేంద్రాల ముందు భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, బట్టుగూడెం మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, సర్పంచ్‌లు కొమిరె శ్రీకాంత్, కొలను శ్రీవాణి కృష్ణారెడ్డి, నాయకులు బద్ధం శేఖర్‌రెడ్డి, అమృతం శివకుమార్, సోము రమేష్, బానోత్ నరేందర్ నాయక్, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వడకాల శివ పాల్గొన్నారు.