రాజాపేట, మార్చి 25 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.బసవారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు ఆర్థిక ప్రగతిని సాధించడానికి పెరటి కోళ్ల పెంపకం దోహదం చేస్తుందన్నారు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ పి.జానయ్య మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు పెరటి కోళ్లను జాగ్రత్తగా పెంచుకుని ఆర్థికంగా ఎదుగాలని కోరారు.
63 మంది మహిళలకు ఒక్కొక్కరికి 20 కోళ్లతో పాటు 20 కిలోల దాణ, నీటి తొట్టెలు, దాణ తొట్టెలు ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్వేరు బాలరాజు, డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, స్థానిక మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎం.చంద్రారెడ్డి, డాక్టర్ పి.భాస్కర్, పశు వైద్య సహాయకుడు జి.అశోక్, టి.శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.