రాజాపేట, మే 26 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నాను ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయ్రపదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం రాజపేట మండల పరిధిలోని సింగారం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీలో కొత్త కొత్త జీఓలు, రూల్స్ తెచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతున్నట్లు దుయ్యబట్టారు.
చట్టంలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త జాబ్ కార్డులు, భార్యాభర్తలకు గడ్డపార, తట్ట, పార, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలని ఉన్నా ఇవ్వడం లేదన్నారు. చట్టంలో ఉన్నట్టు వేసవి అలవెన్సులు, నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీలు ఇవ్వాలన్నారు. ఆధార్ కార్డుతో లింక్, ఆన్లైన్ పేమెంట్ చెల్లింపులు, కొలతలు ఆధారంగా వేతనాలు ఇచ్చే పద్ధతి రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇచ్చి పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ మాట్లాడుతూ వాచర్లను, సీనియర్ మేట్లను ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యంతో పాటు, చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కటికల రామచంద్రం, ఫీల్డ్ అసిస్టెంట్ దంబడి కనకమ్మ, ఉపాధి హామీ కార్మికులు జాప మల్లేశం, ఎర్వ సబిత, బోనాల బాలలక్ష్మి, కోడేల పద్మ, ముచ్చనపల్లి మౌనిక, కటిక సంధ్య, జాప కృప, బొల్లు కవిత, బోనాల పద్మ, బోనాల అండాలు, వెంకటేశ్, ఎర్ల బాల్ రెడ్డి, జాప అనీల్, నాగమణి, ఎల్లయ్య పాల్గొన్నారు.