రాజాపేట, జూన్ 04 : పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రం ఎదురుగా మండల పాల సొసైటీ చైర్మన్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు సహనంతో, మదర్ డైరీ పైన ఉన్న నమ్మకంతో నెలల తరబడి పాల బిల్లులు చెల్లించకపోయిన ఊరుకున్నామని, కానీ తమ సహనాన్ని చేతగానితనంగా భావించి పాడి రైతులను గోస పెట్టడం సరికాదన్నారు.
ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నియోజవర్గ పర్యటనలో భాగంగా విజయ డైరీకి నిధి ఇచ్చే విధంగా మదర్ డైరీకి కూడా కొంత నిధిని తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకుని సీఎం నోటి వెంట మదర్ డైరీని ఆదుకుంటామనేటువంటి స్పష్టమైన హామీ వచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల సొసైటీ చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి రామిడి బాపురెడ్డి, మల్లారెడ్డి మహేందర్ రెడ్డి, భూపాల్, బాలయ్య, రాజు బ్రహ్మయ్య, నర్సింలు, బాబు, సిద్ధులు, పాడి రైతులు పాల్గొన్నారు.