యాదగిరిగుట్ట, ఏప్రిల్ 09 : పెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లి ప్రధాన రహదారిపై గ్యాస్ బండతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుందన్నారు. బీజేపీ అనుకూలమైన రాష్ట్రాల్లో ఎన్నికల్లో నామమాత్రంగా గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించిననట్లుగా ప్రకటన చేసి ఎన్నికలు ముగియగానే ధరలను పెంచడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి ఆరె పుష్ప, మహిళా నాయకులు ఉట్కూరి బాలమణి, గోద సువర్ణ, ముత్తమ్మ, గుండు మమత, కొన్ని మహేశ్వరి, మమత, లలిత, రాచకొండ భాగ్యమ్మ పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు రాయితీలు, ప్రజలపై పన్నుల భారాలను మోపుతున్న బీజేపీ ప్రభుత్వం, మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రజలను ఆర్థికంగా దివాలా తీస్తున్నదని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. మండలంలోని గౌరాయిపల్లిలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసి, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో గ్యాస్ బండతో నిరసన చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు 20 సార్లు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై విపరీత భారం వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసి డివిజన్ నాయకులు కొంగర సాయిరాం, గ్రామ నాయకులు గడ్డం యాదగిరి, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు కొంగరి ప్రమీల, శ్యామల, లక్ష్మి, పీవైఎల్ నాయకులు గడ్డం శేఖర్, రమేశ్, శ్రీను పాల్గొన్నారు.