రాజాపేట, జూన్ 09 : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని, వెంటనే వారు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే ప్రజలు మీపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. సంస్కారం లేకుండా మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు కండ్లు లేని కబోధులని, అవి తెరిచి చూస్తే గత పదేళ్లుగా ఆలేరులో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
పింఛన్ పెంపు, తులం బంగారంతో పాటు రైతు భరోసాను ఎగనామం పెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. గంధమల్ల ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని, అలాంటి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మంజూరైందన్నారు. యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల సైతం గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ప్రత్యేక కృషితో కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. శంకుస్థాపన చేసిన పనులకే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
బీర్ల ఐలయ్యకు ఆలేరును అభివృద్ధి చేయడం చేతకాక పొద్దున లేస్తే తిట్ల పుస్తకం చదువుతున్నారన్నారు. ఆలేరు ప్రజలు ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించి సత్తా చాటుకోవాలని హితవు పలికారు. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నాయకుల సహనాన్ని పరీక్షించొద్దని, వాళ్లు కన్నెర్ర చేస్తే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరిగే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, సంధిలా భాస్కర్ గౌడ్, ఎర్రగోకుల జస్వంత్, మేక వెంకటేశ్వర్ రెడ్డి, మరల నాగరాజు, బేడుద వీరేశం, బిళ్లకుదురు రాజు, గొడుగు రాజు, గజ్జల రాజు, బోగా హరినాథ్, లక్ష్మణ్ నాయక్, ఉప్పలయ్య గౌడ్, ఉల్లి రమేశ్, సోమలింగం గుప్తా పాల్గొన్నారు.