– ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
మోటకొండూర్, జూన్ 08 : ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో అడుకుంటుందని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయమని బీఆర్ఎస్ మోటకొండూర్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం, అధికారులు అవలంబిస్తున్న మొండి వైఖరిని, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి జూన్ 2వ తేదీ నాటికి వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తానని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, జూన్ 8వ తేదీ దాటినా కొనుగోళ్లు పూర్తి కాకపోగా.. రైతులు వడ్ల కుప్పల వద్దే అగచాట్లు పడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ సెక్రటరీ జనరల్ సిరబోయిన నర్సింహులుయాదవ్, నాయకులు బొట్ల నర్సింహ, జివిలికపల్లి వెంకటేశ్, బొట్ల మహేష్, బొట్ల పాండు, గంధమల్ల మధు, మల్ల వెంకటేష్, కొల్లూరి మైసయ్య, దరిపల్లి బాలకృష్ణ, కొండమడుగు వీరనర్సింహ పాల్గొన్నారు.