యాదగిరిగుట్ట, నవంబర్ 7 : భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బీఆర్ఎస్ సర్కారులో ఇల వైకుంఠాన్ని తలపించేలా పున్నర్నార్మిణం చేసుకున్నది. ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా రూ.1,300 కోట్లతో ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారు. అనేక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన పనుల్లో కొన్ని పురోగతిలో ఉండగా, మరికొన్ని చేపట్టాల్సి ఉన్నది. ఇంతలో ప్రభుత్వం మారగా.. యాదగిరిగుట్ట అభివృద్ధి ఆశించిన మేర ముందుకు పడడం లేదు.
ఈ ఏడాది మార్చి 11న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో తొలిసారిగా హాజరైన రేవంత్‌రెడ్డి.. లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని వెళ్లారే తప్ప.. అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్నా యాదగిరిగుట్ట దేవస్థానానికి ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు గుట్టకు వస్తున్నారు. ఈసారైనా యాదగిరిగుట్ట క్షేత్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ఇప్పటికే పురోగతిలో ఉన్న పనుల పూర్తిపై స్పందించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఎంట్రీ ఫ్లైఓవర్, ఫోర్ లేన్ రోడ్లు, తెప్పోత్సవం, నిత్యన్నదానం, దేవస్థానం బస్టాండ్, టెంపుల్ సిటీపై డోనర్ కాటేజీల నిర్మాణం వంటి పనులపై దృష్టి సారించాల్సి ఉంది.
పెండింగ్‌లోనే నెట్వర్క్ బ్రిడ్జి
గత ప్రభుత్వ హయాంలోనే 69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొండపైకి వెళ్లేందుకు, కొండ కిందికి దిగేందుకు ఎగ్జిట్, ఎంట్రీ ఫ్లైఓవర్‌ను ప్రతిపాదించగా.. అప్పట్లోనే ఎగ్జిట్ ఫ్లైఓవర్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. కొండ కింద వైకుంఠ ద్వారం సమీపంలో గల ఆర్య వైశ్య సత్రం నుంచి ఎంట్రీ ఫ్లై ఓవర్ కోసం నెట్వర్క్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్‌రోడ్డు పాత నిత్యాన్నదాన భవనం వరకు దీన్ని అనుసంధానం చేశారు. దీని దగ్గర 64 మీటర్ల పొడవుతో ఆర్చ్ బ్రిడ్జి రానున్నది. ఇందులో 7 ఫిలర్లు, 32 మీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యాయి. లండన్ నుంచి దిగుమతి చేసుకున్న నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని బిగించాల్సి ఉంది. రూ.69కోట్లలో రూ.34కోట్లు మంజూరు చేయగా రూ.20కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 14 కోట్లు కావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధుల్లేక బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
టెంపుల్ సిటీపై ముందుకు సాగని డోనర్ కాటేజీల నిర్మాణాలు
యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే భక్తులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడపాలన్న ఉద్దేశంతో స్వామివారి కొండకు పశ్చిమ దిశలో టెంపుల్ సిటీని నిర్మించారు. సకల వసతులు, గార్డెనింగ్, చెట్లు, మంచినీటి, విద్యుత్ సౌకర్యాలతోపాటు హెలిప్యాడ్‌ను నిర్మించారు. 1000 గజాల్లో 250 డోనర్ కాటేజీలను నిర్మించాలని సంకల్పించి, ఇందుకు కావాల్సిన స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. పలువురు దాతలు కాటేజీలు నిర్మించేందుకు సిద్ధంగా ఉండగా, ఆ పనులపై దృష్టి సారించాల్సి ఉంది.
రాజాపేట నుంచి చేర్యాల ఫోర్ లేన్ రోడ్డు..
స్వామివారి క్షేత్రానికి నలుమూల నుంచి వచ్చే భక్తులకు రహదారి సమస్యలు తలెత్తవద్దని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్టకు ఫోర్‌లేన్ బీటీ రోడ్డు వేసింది. ఆ నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా, మల్లాపురం బైపాస్ నుంచి పట్టణంలోని గండిచెరువు వరకు 2 కిలో మీటర్ల మేర మాత్రం పెండింగ్‌లో ఉంది. రూ.290కోట్లతో యాదగిరిగుట్ట నుంచి రాజాపేట మీదుగా చేర్యాల వరకు సుమారు 37 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల ఫోర్‌లేన్ బీటీ రోడ్డును గత ప్రభుత్వం ప్రతిపాదించగా డీపీఆర్ కాలేదు. ఈ రోడ్డు పనులను కూడా ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది.
ప్రారంభానికి నోచని మినీ శిల్పారామం
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా వైటీడీఏ నిధులతో ఎకరన్నరలో మినీ శిల్పారాయం ఏర్పాటుచేశారు. స్వాగత తోరణం, పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేద తీరేందుకు మైదానం సిద్ధం చేశారు. రాత్రివేళల్లో పరిసరాలన్నీ జిగేల్ అనిపించేలా రాయగిరి ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. శిల్ప, హస్తకళా వైభవం ఉట్టిపడే విధంగా రాయగిరి చెరువు ప్రాంతానికి మెరుగులు అద్దారు. ఆ పనులన్నీ పూర్తయినా కాంగ్రెస్ సర్కారులో మినీ శిల్పారామం ప్రారంభానికి నోచడం లేదు. దాంతో శిల్పారామంలో ఏర్పాటుచేసిన ఆట వస్తువులు, పుడ్ కోర్టులు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయి.
తెప్పోత్సవం సంగతేంటి?
కొండ కింద గండి చెరువు సుందీకరణతోపాటు తెప్పోత్సవం నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం యోచించింది. అందుకోసం రూ.33.07 కోట్లు మంజూరు చేసింది. రూ.20 కోట్లు వెచ్చించి దాదాపు 60 శాతం పనులను పూర్తి చేసింది. మరో రూ.13.07 కోట్లు అవసరం. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే స్వామివారి తెప్పోత్సవం, లేజర్ షో, ప్రధాన ప్రవేశ ద్వారం, ఫౌంటేన్, ఆంపీ థియేటర్ వంటి చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఆలయ చరిత్రలో తొలిసారి స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమాన్ని గండిచెరువులో చేసేందుకు గత ప్రభుత్వం నిశ్చయించగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు.
స్వర్ణతాపడం విరాళాలపై స్పష్టత కరువు
స్వామివారి ఆలయ దివ్య విమానగోపురం బంగారుమయం చేయాలన్న లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ 2022 ఫిబ్రవరి 11న కీలక ప్రకటన చేశారు. స్వర్ణతాపడంలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని సంకల్పించి తమకు తోచిన విరాళం అందించవచ్చని పిలుపునిచ్చారు. దాంతో గత బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు, వ్యాపారులు భారీగా విరాళాలు అందజేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 30న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని కిలో 16 తులాల బంగారానికి సంబంధించి రూ.52,48,097 చెక్కును అందజేశారు. ఇలా.. మొత్తం దాదాపు వంద కిలోల బంగారం స్వామివారి స్వర్ణతాపడానికి సమకూరింది. ఈఓ భాస్కర్‌రావు మాత్రం 10 కిలోల 500 గ్రాముల బంగారం, రూ.20కోట్ల నగదు సమకూరిందని వెల్లడించారు. మిగతా బంగారం నిమిత్తం స్వామివారి హుండీకి సమకూరిన బంగారం, వెండిని వినియోగించి 65 కిలోల బంగారం వినియోగించి స్వర్ణతాపడం పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో సమకూరిన విరాళాల వివరాలను వెల్లడించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి డిమాండ్ చేస్తన్నారు.