యాదాద్రి భువనగిరి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, సీఎం టూర్లో మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాల తరలింపులో భాగంగా ముందుగా నిర్ణయించిన పైలాన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పర్యటన ఇలా..
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఉదయం 9.20 గంటలకు హెలీకాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకుంటారు. 9.30 నుంచి 10 గంటల వరకు ప్రెసిడెన్షియల్ సూట్లో గడుపుతారు. తన జన్మదినం సందర్భంగా 10.05గంటల నుంచి 11.15గంటలకు ప్రధానాలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఒంటి గంట వరకు యాదగిరిగుట్ట అభివృద్ధిపై వైటీడీఏ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఒకటిన్నరకు అక్కడి నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో రెండు గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని, మూసీ పునరుజ్జీవన యాత్రను ప్రారంభిస్తారు. 3గంటల నుంచి 5 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతంలో భీమలింగం, ధర్మారెడ్డి కాల్వ వరకు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత నాగిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డుకు చేరుకుని ఓపెన్ టాప్ జీపుపై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరుతారు.
సర్వం సిద్ధం..
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. యాదగిరిగుట్టులో హెలీప్యాడ్ ఏర్పాటుచేశారు. సంగెం వద్ద ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి రోడ్డును చదును చేశారు. కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఆయా పనులను పరిశీలించారు. వారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సుమారు 20వేల మందిని తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది.
పైలాన్ ప్రారంభోత్సవం రద్దు..
సీఎం టూర్లో భాగంగా యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్ ప్రారంభోత్స కార్యక్రమం రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి నీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను యాదగిరిగుట్టలో రేవంత్‌రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేయాలి. దీని ద్వారా 550కి పైగా గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. ఇందుకోసం రూ.210 కోట్లు మంజూరు చేశారు. కానీ, షెడ్యూల్ నుంచి పైలాన్ కార్యక్రమాన్ని తొలగించారు. మలన్నసాగర్ నుంచి జిల్లాకు తరలించాలనుకున్న జలాలన్నీ కాళేశ్వరం నుంచే వస్తున్నాయి. ఇటీవలి వరకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే నీళ్ల సరఫరాకు శంకుస్థాపన చేయాల్సి ఉండడంతో ఏమనుకున్నారో ఏమో ఆఖరి నిమిషంలో కార్యక్రమం రద్దు చేశారు.
పటిష్ట పోలీస్ బందోబస్త్..
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు యాదగిరిగుట్టతోపాటు వలిగొండ మండలంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సుధీర్‌బాబు, డీసీపీ రాజేశ్ చంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సందర్శించే ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. డాగ్ స్కాడ్, బాంబ్ స్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సుమారు 2వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సీఎం పర్యటన ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.