దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించిన తెలంగాణ గురుకులాలు నేడు అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. గతంలో గొప్పగా చెప్పుకొన్న గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ సరారు అస్తవ్యస్తం అద్దె భవనాలను కిరాయి కూడా చెల్లించకుండా గాలికొదిలేసింది. నెలల తరబడి బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో భవన యజమానులు మంగళవారం గురుకులాలకు తాళం వేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కూరు ఎస్సీ గురుకుల పాఠశాల, హుజూర్నగర్, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో మైనారిటీ గురుకులాలు తెరుచుకోలేదు. దాంతో విధులకు హాజరైన టీచర్లు గేటు బయటే ఉండిపోవాల్సి వచ్చింది.
తెలంగాణ గురుకులాలు అంటేనే ఓ బ్రాండ్. దేశంలోనే ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి. నాణ్యమైన చదువు, మంచి సదుపాయాలు, నైపుణ్యం గల స్టాఫ్, క్రీడలు.. తదితర అంశాల్లో ఒక అడుగు ముందు ఉండేవి. గురుకులాల్లో సీటు కావాలంటే అంతా ఆశామాషీగా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేల లెటర్ల కోసం ప్రదక్షిణలు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాలు సమస్యలమయంగా మారుతున్నాయి. ఫుడ్ పాయిజన్, వివిధ అనారోగ్య సమస్యలతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. కొన్ని గురుకులాల్లో పిల్లలు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి.
లక్షల్లో పెండింగ్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకుల ఏర్పాటు చేసింది. సొంత భవనాలు లేనిచోట తాత్కాలికంగా అద్దె భవనాల్లో కొనసాగినా, ఎప్పటికప్పుడు కిరాయి చెల్లించేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుండగా, 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 గిరిజన, 3 మైనార్టీ, 8 ఎస్సీ, 5 బీసీ గురుకులాలు ఉన్నాయి. వాటిల్లో 70శాతం వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఏరియాను బట్టి ఒక్కో భవనానికి నెలకు రూ. లక్ష నుంచి రూ. 4 లక్షల వరకు అద్దె ఉంది. 5 ఎస్సీ గురుకులాలకు 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదు.
ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదు. దాంతో చేసేది లేక మోత్కూరు ఎస్సీ బాలుర గురుకులానికి బిల్డింగ్ యజమాని తాళం వేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని వాపోయాడు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌లో మైనారిటీ గురుకులాలు ఉండగా, అన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి నెలకు రూ.60 వేల నుంచి 75 వరకు నెలవారీ అద్దె ఉండగా, దాదాపు 40 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. దాంతో ఈ నాలుగు పాఠశాలలకు యజమానులు తాళం వేశారు.
బకాయిలు ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ గురుకులాలకు కూడా ఆరు నెలలుగా బకాయిలు విడుదల చేయడం లేదు. భువనగిరి మండలంలోని అనంతారం, చౌటుప్పల్ మండలంలోని తుప్రాన్‌పేట, ఆలేరు, బీబీనగర్‌తోపాటు బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో సికింద్రాబాద్, యాకత్పురా నియోజకవర్గాలకు చెందిన బీసీ గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. గిరిజన గురుకుల కూడా ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. నారాయణపురంలోని గురుకులం అద్దె భవనంలో నడుస్తున్నది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని కేబీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో మైనార్టీ గురుకులం, ఆలేరులో మరో గురుకులం అద్దె భవనంలోనే కొనసాగుతుండగా, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.