హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రజాప్రతినిధ్య చట్టం-1951తోపాటు ఏఐఎఫ్బీ పార్టీ నిబంధనావళి ప్రకారం.. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీ ఫామ్ జారీచేయాల్సి ఉంటుంది. కానీ, ఏఐఎఫ్బీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కోసం నియమితులైన కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ నిబంధనావళికి విరుద్ధంగా బీ ఫామ్‌లు అందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 288 మంది ఏఐఎఫ్బీ పార్టీ తరఫున పోటీ చేశారు. వీరిలో 40 మంది వివిధ మున్సిపాలిటీల్లో గెలుపొందారు. వీరికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా సభ్యత్వం నమోదు కోసం నియమితులైన కన్వీనర్ అనధికారంగా బీ ఫామ్‌లు ఇవ్వడం ఎన్నికైన అభ్యర్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. దీంతో వీరి ఎన్నిక చెల్లుతుందా? చెల్లదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ల అభ్యంతరాలు!
ఏఐఎఫ్బీ బీ ఫామ్‌లను పరిశీలించిన మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం స్థానాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాసినట్టు సమాచారం. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు వేర్వేరు వివిధ ఫిర్యాదులు కూడా అందినట్టు తెలిసింది. ఈ అంశంపై ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడిని వివరణ కోరగా, పార్టీ నిబంధనల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ బీ ఫామ్‌లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇదే అంశంపై ఎస్ఈసీ అధికారులను వివరణ కోరగా.. బీ ఫామ్‌ల అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.