జనగామ, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడిపై జనగామలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు భగ్గుమన్నాయి. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్ సమయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో దళిత మహిళ, స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజులపై దాడి చేసిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా చేతిని పైకెత్తిన దళిత ప్రజాప్రతినిధి పట్ల అనుచితంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేసిన వారికి ప్రభుత్వం అండగా నిలువడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సభ్యులపై ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో దళిత నాయకులు పసుల ఏబెల్, గద్దల నర్సింగరావు, కన్నారపు పరుశురాములు, మల్లిగారి రాజు, వాంకుడోత్ అనిత, తిప్పారపు విజయ్, కన్నారపు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.