రాజాపేట, జనవరి 27 : కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా నిలిచే తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్క వనదేవతల జనజాతర ఎల్లమ్మ బోనాలతో మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలోని కుర్రారం, బూర్గుపల్లి గ్రామ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో ప్రదర్శనగా వెళ్లి ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. దేవతకు పసుపు, కుంకుమ గాజులు, వడి బియ్యాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతలకు సమర్పించుకునేందుకు భక్తులు ఒడి బియ్యాలు, బంగారం, గొర్రెలు, మేకలు, ఇతర వంట సామగ్రి తీసుకుని వాహనాలల్లో జారతకు పెద్ద ఎత్తున చేరుకుంటుడడంతో మెల్లమెల్లగా ప్రాంతమంతా జనార్యణంగా మారుతుంది. ఆలయం పరిసరాలల్లో పెద్ద ఎత్తున్న దుకాణాలు, హోటళ్లు వెలిశాయి.

Rajapet : వైభవంగా చిన్న మేడారం జాతర ప్రారంభం
గద్దెలకు సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు చెట్టూ, పుట్ట, చేను, సెలకల్లో భక్తులు తమ విడిది స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అడవి తల్లుల ఆగమనం అనంతరం మొక్కలు సమర్పించుకోవాలని దృఢ సంకల్పంతో వన దేవతల రాక కోసం ఎదురు చూస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల ఆరాధ్యదైవమైన సారలమ్మ నేడు కుర్రారం శివారులోని ఏదుల గుట్ట వద్ద ప్రత్యేక పూజలు స్వీకరించి అనంతరం గద్దెనెక్కనుంది. ఆ సమయంలో వన దేవతల ఆలయ ప్రాంతం జనసంద్రం కానుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడి వన దేవతల జాతర పెద్ద మేడారం జాతర తరహాలో జరుగనుంది.

Rajapet : వైభవంగా చిన్న మేడారం జాతర ప్రారంభం