యాదగిరిగుట్ట, మే 05 : యాదగిరిగుట్టలోని చండీశ్వర భవనం ముమ్మాటికి కురుమ కులస్తుల భవనమేనని, ఎప్పటికైనా ఆ భవనాన్ని కైవసం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరవు రాములు కురుమ, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ అన్నారు. సోమవారం యాదగిఁగుట్ట పట్టణంలో మీడియాతో వారు మాట్లాడారు. గత 20 ఏళ్లుగా కురుమ కులానికి పట్టిన శనిగా మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశ్ మారాడని, ఆయన గద్దె దిగేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. తన అనుచరులతో ఇష్టారాజ్యంగా ఓట్లేసుకుని 30 ఏళ్లుగా కురుమ సంఘం అధ్యక్షుడిగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, కురుమ కులస్తులకు తీరని అన్యాయం చేస్తున్నట్లు దుయ్యబట్టారు. యెగ్గె మల్లేశ్ కురుమ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉంటూ డబ్యులు దండుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. మన్సురాబాద్ కురుమ సంఘానికి చెందిన హాస్టల్ భవనాన్ని లీజుకు ఇచ్చిన డబ్యుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లో విద్యార్థుల వద్ద నెలవారి ఫీజులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు.
కొమురవెళ్లిలో కురుమ కులస్తులను వాడుకున్నారే తప్పా, కులస్తులకు ఆయన చేసిందేమీ లేదన్నారు. యాదగిరిగుట్టలో కురుమ సంఘానికి చెందిన చండీశ్వర భవనంలోకి కురుమ కులస్తులకు అనుమతిలేదని చెప్పడం తీవ్ర అభ్యంతకరమన్నారు. ఎంతోమంది దాతల సహకారంతో నిర్మించిన భవనాన్ని తమ సొంత నిధులతో నిర్మించినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భవన ప్రారంభోత్సవ సమయంలో కురుమ కులస్తులమంతా సంఘం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినట్లు తెలిపారు. శిలాఫలకంపై కురుమ కులస్తుల ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు. తమ సొంత నిధులతో భవనం నిర్మించామని, కురుమ కులస్తులు ఎవ్వరూ రావొద్దంటూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కురుమ కులస్తులు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
యెగ్గె మల్లేశ్ చేసిన నిర్వాకంతో యాదగిరిగుట్టలో కురుమ కులస్తులకు స్వంత సత్రం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికిప్పుడు భవనం నిర్మించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. ఇటీవల ఆలేరు పట్టణంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు వెళ్లిన కురుమ కులస్తులను ఆయన తీవ్రంగా అవమానపరిచారన్నారు. ”చనిపోయినోళ్లకు విగ్రహాలు పెట్టడమేందిరా” ”మీకేం పనిలేదురా మీ అమ్మా” అంటూ దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఈ నెల 15న యాదగిరిగుట్ట పట్టణంలో కురుమ సంఘం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు, పార్టీలకు అతీతంగా కురుమ కులస్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరేరు పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం కురుమ, కురుమ సంఘం నాయకులు కొన్నె మల్లేశ్ కురుమ, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, నాయకులు సిద్దులు, కర్రె గణేశ్ పాల్గొన్నారు.