ఆలేరు టౌన్, జూలై 26 : వందకు పైగా ద్విచక్ర వాహనాలను కొట్టేసిన దొంగను ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు శివారులోని చౌదరి దాబా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి అదుపులో ఉన్న నాలుగు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆలేరు ఎస్హెచ్ఓ ఎం.కొండల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన కంప విజయ్ బుల్లెట్‌పై, జనగామ జిల్లాకు చెందిన మరో మైనర్ బాలుడు యాక్టివా వాహనం పై జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆలేరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన చౌదరి దాబా వద్ద పోలీసులు వాహనాల తనఖీ చేపట్టారు.
ఈ క్రమంలో రెండు వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో బైక్ ఆర్సీ పత్రాలను అడగడంతో తడబడడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాహనాలను దొంగతనం చేసినట్లుగా చెప్పారు. అంతేకాకుండా అప్పటికే అపహరించి జనగామ సమీపంలోని చెట్ల పొదల్లో దాచినా మరో రెండు బైకులను స్వాధీనం పరుచుకున్నారు. కంప విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విజయ్‌తో పాటు పట్టుబడిన మరో బాలుడిని తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ ఎన్.విజయకుమార్, కానిస్టేబుల్ ఎం.మహేశ్, సీహెచ్ చంద్రశేఖర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ ఆకాంక్ష యాదవ్, అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, యాదగిరిగుట్ట ఏసీపీ పి.శ్రీనివాస్ నాయుడు అభినందించారు.