చౌటుప్పల్, అక్టోబర్ 08 : అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ శివాజీ అన్నారు. బుధవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్, శ్రీ మేధా జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక నివారణకు అనుసరించాల్సిన చర్యలు ఫైర్ సర్వీస్ సిబ్బంది విద్యార్థులకు డెమో ద్వారా అవగాహన కల్పించారు. ప్రజలు ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 కి సమాచారం అందించాలన్నారు. అప్రమత్తతతోనే ప్రమాదాలను చాకచక్యంగా నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ సిలివేరు శ్రీనివాస్, ఫైర్ సిబ్బంది పాండు జమిందార్, భాగ్య నాయక్, నరేశ్, నరసింహ, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.