– ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 16 : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి పట్టణ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బందనాదం బాల ఆకాశ్ మరణించాడని, కావునా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బందనాదం బాల ఆకాష్ మృతదేహాన్ని సోమవారం ఆయన సందర్శించారు. మృతి చెందిన బాలుడు నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం ఇనుపాముల ఆవాస గ్రామమైన రాయపురం వాస్తవ్యుడు. శోకసంద్రంలో మునిగిన బాలుడి కుటుంబ సభ్యులను చిరుమర్తి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సంఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

‘బాల ఆకాశ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి’
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భువనగిరి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న బాల ఆకాష్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ వచ్చి వివరణ ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదన్నారు. స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈత కొట్టేందుకు పొలం వద్దకు వస్తున్నారని రైతు అనేకమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఈ సంఘటనకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి కారకులని, ఈ విషయం కలెక్టర్ దృష్టిలో ఉన్నప్పటికీ దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన జిల్లా కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘బాల ఆకాశ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి’
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుండి గురుకులాల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులు ఇలానే మరణించినట్లు తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. గురుకులాల్లో నిత్యం ఏదో ఒక సమస్యతో విద్యార్థులు సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని బియ్యం, కుళ్లిన గుడ్లు, ఫుడ్ పాయిజన్, పాముకాట్ల వంటి అనేక సంఘటనలతో అమాయకమైన వందల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్నారు. పేపర్ ప్రకటనలు, సెల్ఫ్ డబ్బాలతో జిల్లా కలెక్టర్ కాలయాపన చేయడం తప్పా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్న దాఖలాలు జిల్లాలో ఎక్కడా లేవన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులతో సహా అధికారులు కూడా గప్పాలు కొట్టడం తప్పా పేద ప్రజల బాధలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు. జిల్లా కేంద్రంలో ఇంత దారుణం జరిగి 24 గంటలు దాటినా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రభుత్వ యంత్రాంగం దీనిపై స్పందించలేదన్నారు. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో చలనం లేదని, అధికారుల నుండి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు.